| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
183. తుమ్మెద పదము
| తుమ్మెద పదములను గురించి పాల్కురికి సోమనాథుడు (క్రీ.శ. 1300) మొట్టమొదట చెప్పినాడు. ఈ పదాల చరణముల చివర తుమ్మెదా అన్నమాట విధిగా వచ్చుచుండుటే వీటి ఈ పేరునకు కారణము. తుమ్మెదా అన్నది ఈ తత్వములోవలె జీవునిగాని, అన్నమయ్యది 'తొల్లిటివలె గావు తుమ్మెదా' అన్న సంకీర్తనములో వలె పరమేశ్వరునో - 'ఏవూరు ఏపల్లె తుమ్మెదా' అన్న పాటలో వలె ఒక వ్యక్తినో ఉద్దేశించి అనేమాట. ఈ పదము ఏగంటి వచనాలలోనిది. ఏగంటి నంజేశ్వరునికి అంకితము. గార్లపాటి లక్ష్మయ్య గారు రచించినది. ఈయన పోసెట్టి లింగకవికి గురువే అయినచో ఇంచుమించు అన్నమయ్యకు సమకాలికులు అయియుందురు. ఈ యిద్దరి రచనలకున్నూ గతిసామ్యము చాలా కనబడుతున్నది. సంప్రదాయము ఈయన రచనలను "వచనములు" అన్ననూ పోసెట్టి లింగకవి "పాటలు" అనే అన్నాడు. |
|
శ్రీకంఠుడను పువ్వు తుమ్మెదా - మూడు లోకమ్ములాయెను తుమ్మెదా సాకారమై యుండు తుమ్మెదా - పర మైకాంతమున జూడు తుమ్మెదా | |
|
శివశివా యనవె తుమ్మెదా శివుడనగ విన్నమేల్ తుమ్మెదా శివుని భక్తులాకు తుమ్మెదా శివ శరణన్న మేలె తుమ్మెదా | 1 |
|
ముట్టిముట్టని పువ్వు తుమ్మెదా ముట్టింది జగమెల్ల తుమ్మెదా ముట్టి చూడవేల తుమ్మెదా - అది ముట్టిపాయలేవె తుమ్మెదా | ॥శివశివ॥ 2 |
|
యవ్వానమందావె తుమ్మెదా, బహు పువ్వూల వాసానె తుమ్మెదా క్రొవ్వి నీవెఱుగావె తుమ్మెదా, నీకు నెవ్వి నేరము లేదు తుమ్మెదా | ॥శివశివ॥ 3 |
|
ఆఱురేకుల పువ్వు తుమ్మెదా - అది మీఱిన వాసానె తుమ్మెదా వేఱుసేయక నీవు తుమ్మెదా, శివు జేఱి భజియించవె తుమ్మెదా | ॥శివశివ॥ 4 |
|
యీళ పింగళలు తుమ్మెదా, సుషుమ్న నాళి మధ్యమున తుమ్మెదా మేలి మెఱిగేనీవు తుమ్మెదా, శివ కేళి జరించావె తుమ్మెదా | ॥శివశివ॥ 5 |
|
ఏడుగురు రాజులు తుమ్మెదా, జూడ బండ్లు జోడు తుమ్మెదా, వట్టి యాశ గోసివేసి తుమ్మెదా మోసపోకు మంటి తుమ్మెదా, భక్తి రాశి కెక్కుమంటి తుమ్మెదా | ॥శివశివ॥ 6 |
|
అష్టదళముమీద తుమ్మెదా నీవు మెట్టి చరించావె తుమ్మెదా కష్టాము నెఱుగావె తుమ్మెదా, నీవు స్రష్టవై యుండావె తుమ్మెదా | ॥శివశివ॥ 7 |
|
తొమ్మిది వాకిళ్ళు తుమ్మెదా, నీవు నమ్మి చరించావె తుమ్మెదా ముమ్మూల కోణాల తుమ్మెదా నీవు నెమ్మాది నుండావె తుమ్మెదా | ॥శివశివ॥ 8 |
|
పది పదేనింటనూ తుమ్మెదా, వెండి పదునొండు ఠావులను తుమ్మెదా మెదలాక నిల్చినా తుమ్మెదా నిన్ను కదిలించ గలరటే తుమ్మెదా | ॥శివశివ॥ 9 |
|
ఎనసి తోటపువ్వు తుమ్మెదా నీ వెనయ మానలేక తుమ్మెదా దాని చేజిక్కినా తుమ్మెదా, తోట వాని చేబడుదూవె తుమ్మెదా | ॥శివశివ॥ 10 |
|
నింగినేల వేయు తుమ్మెదా గంగ గవురు లేని నాడు తుమ్మెదా పొంగుచును నొరబోడ? తుమ్మెదా వేయు భంగులా నటియించు తుమ్మెదా | ॥శివశివ॥ 11 |
|
వేయి రేకుల పువ్వు తుమ్మెదా అది వెలుగూను జగమెల్ల తుమ్మెదా సద్గూరు నడుగావె తుమ్మెదా పువ్వు సద్య జూపూ నీకు తుమ్మెదా | ॥శివశివ॥ 12 |
|
గురునాకు హరునాకు తుమ్మెదా, అం తరువు లేదేమి తుమ్మెదా గురుపాదపద్మాలు తుమ్మెదా, నిన్ను దరిశించు మంటీని తుమ్మెదా | ॥శివశివ॥ 13 |
|
గురుడు నీ శీరమూన తుమ్మెదా, మా గురుడు నీ శిరసూన తుమ్మెదా కరపద్మములు మోపి తుమ్మెదా అరయ నేగంటీశుడుండు తుమ్మెదా | ॥శివశివ॥ 14 |
| ఈ పాటలో 'శివశివ...' అన్నది పల్లవి అనవచ్చును. ఈ పాట అన్నమయ్య సంకీర్తనలు, జయదేవుని అష్టపదులు వలెనే చరణము పల్లవి, చరణము పల్లవి, లతో సాగిపోయినది. ఆనాటికి అనుపల్లవి ఏర్పడలేదు. |