| కావ్యములు | మను చరిత్రము | ద్వితీయాశ్వాసము |
| ప్రవరుని సౌందర్యముఁగని వరూధిని మోహించుట | ||
| ఉ. |
అబ్బురపాటుతోడ నయనాంబుజముల్ వికసింపఁ, గాంతి పె ల్లుబ్బి కనీనికల్ వికసితోత్పలపంక్తులఁ గ్రుమ్మరింపఁగా, గుబ్బ మెఱుంగుఁ జన్గవ గగుర్పొడువన్, మదిలోనఁ గోరికల్ గుబ్బతిలంగఁ జూచె, నలకూబరసన్నిభు నద్ధరామరున్. |
28 |
| ఉ. |
చూచి, ఝళంఝళ త్కటక సూచిత వేగ పదారవిందయై లేచి, కుచంబులు\న్ దుఱుము లేనడుమల్లల నాడ, నయ్యెడన్ బూచిన యొక్క పోఁక నునుబోదియఁ జేరి విలోకనప్రభా వీచికలన్ఁ, దదీయ పదవీకలశాంబుధి వెల్లిగొల్పుచున్. |
29 |
| మ. |
మునుమున్ పుట్టెడుకొంకు లౌల్యము నిడన్, మోదంబు విస్తీర్ణతన్ జొనుపన్, గోర్కులు గ్రేళ్లు ద్రిప్ప, మదిమెచ్చుల్ ఱెప్ప లల్లార్ప న త్యనుషంగస్థితి ఱిచ్చపా టొసఁగ, నొయ్యారంబునన్ జంద్రిక ల్దనుకన్ జూచె లతాంగి భూసురుఁ బ్రఫుల్లన్నేత్ర పద్మంబులన్. |
30 |
| క. |
పంకజముఖి కప్పుడు మై నంకురితము లయ్యెఁ బులక లావిష్కృత మీ నాంకానల సూచక ధూ మాంకురములు వోలె మఱియు నతనిన్ జూడన్. |
31 |
| ఉ. |
తొంగలిఱెప్పలం దొలఁగఁ ద్రోయుచుఁ, బైపయి విస్తరిల్లు క న్నుంగవ యాక్రమించుకొనునో! ముఖచంద్రు నటంచుఁ బోవనీ కంగజుఁ డానవెట్టి కదియన్ గుఱివ్రాసె ననంగ, జాఱి సా రంగమదంబు లేఁజెమటఁ గ్రమ్మె లలాటము డిగ్గి చెక్కులన్. |
32 |
| మ. |
అనిమేషస్థితి మాన్పె బిత్తరపుఁజూ, పస్వేదతావృత్తి మా న్పె నవస్వేదసమృద్ధి, బోధకళ మాన్పెన్ మోహవిభ్రాంతి, తో డనె గీర్వాణవధూటికిన్, భ్రమర కీట న్యాయ మొప్పన్ మను ష్యుని భావించుట మానుషత్వము మెయింజూపట్టె నానత్తఱిన్. |
33 |
| వ. | ఇట్లతని రూపరేఖావిలాసంబులకుంజొక్కి, యక్కమలపత్రేక్షణ యాత్మగతంబున. | 34 |
| ఉ. |
ఎక్కడివాఁడొ! యక్షుతనయేందు జయంత వసంత కంతులన్ జక్కఁదనంబునన్ గెలువఁ జాలెడు వాఁడు, మహీసురాన్వయం బెక్కడ? యీతనూవిభవమెక్కడ? యేలని బంటుగా మరున్ డక్కఁగొనంగరాదె యకటా! నను వీఁడు పరిగ్రహించినన్. |
35 |
| సీ. |
వదన ప్రభాత లావణ్యాంబు సంభూత, కమలంబు లన వీనికన్ను లమరు నిక్కి వీనులతోడ నెక్కసక్కెములాడు, కరణి నున్నవి వీని ఘనభుజములు, సంకల్ప సంభవాస్థాన పీఠిక వోలె, వెడఁదయై కనుపట్టు వీని యురము ప్రతిఘటించు చిగుళ్ళపై నెఱ్ఱవాఱిన, రీతి నున్నవి వీని మృదుపదములు, |
|
| తే. |
నేరెటేటియసల్ తెచ్చి, నీరజాప్తు సానఁ బట్టిన రాపొడి చల్లి, మెదిపి పదను సుధ నిడి చేసెనో పద్మభవుఁడు వీని; గాకున్నఁ గలదె యీ మేని కాంతి? |
36 |
| క. |
సుర గరుడోరగ నర ఖే చర కిన్నర సిద్ధ సాధ్య చారణ విద్యా ధర గంధర్వ కుమారుల నిరతము గనుఁగొనమె! పోల నేర్తురె వీని\న్? |
37 |
| మ. |
అని చింతించుచు మీనకేతనధనుర్జ్యాముక్త నారాచ దు ర్దిన సమ్మూర్ఛిత మానసాంబురుహయై, దీపించు పెందత్తఱం బునఁ బేటెత్తిన లజ్జ నంఘ్రికటకంబుల్ మ్రోయ, నడ్డంబు ని ల్చిన నయ్యచ్చరఁ జూచి చేరఁ జని పల్కె\న్ వాఁడు విభ్రాంతుఁడై. |
38 |