| కవితలు | రుధిరజ్యోతి శ్రీరంగం నారాయణబాబు |
చిన్నా! |
| చిన్నా! |
|
(వ్యక్తం చేసుకుందామని, చైతన్య స్రవంతిని ఈది, వ్యక్తం కంటబడకుండా వ్యక్తా వ్యక్తంలో తలదాచు కుంటున్న తలపులు చెప్పేందుకే ఇందులో చేసిన ప్రయత్నం) |
|
మన్ను తింటున్న చిన్నా! మీ నాన్న నిన్ను కొడితె ఏమిటి అల్లా చూస్తావు |
|
నీ చూపులు? నాగమయ్య గొంతును తడిపె చవితినాడు చిమ్మిలి తిన్నవా? పుట్టబంగారం పెట్టుకున్నవా 'చెవి పోటుకు మంద'ని చెపుతున్నాయి! తెలియకపోతె అమ్మనడిగి తెలుసుకొమ్మని! |
|
నీచూపులు? వెదురుక్రోవి సావాసం చేసిన మోవి! ధర్మ క్షేత్రం కురుక్షేత్రం గీతామధువుల జపాసుమం నారాయణ చక్షువు నడిగి మన్ను రుచి తెలుసుకొమ్మని! |
|
నీచూపులు? నీ కవ్యక్తం తెలిసిందంటాయి పనికిరాదు వ్యక్తావ్యక్తంలో వెలుగునీడలమధ్య ఈతకొట్టే కవులం! మన్నుతింటే పాండురోగ మొస్తుందంటాం ఏం ఏమంటాయి నీచూపులు? భూమి పూతచుట్ట! నిశ్శబ్ద పురాణ సంవత్సర సంపుటముల దొంతి రేకులు తిప్పి పుట్టలు విప్పి చూపిస్తున్నాయి. పూర్వం మీ పెరడు ఇనుప గని ఇప్పటికీ మంటిలోన ఇనుముందని పాండురోగానికి మందని! చిన్నా! నీచూపులు వేదాలు నీవె బ్రహ్మపదార్థానివి!! |