| కవితలు | రుధిరజ్యోతి శ్రీరంగం నారాయణబాబు |
ఎవరికి తెలుసు |
| ఎవరికి తెలుసు |
|
ఎందుకులే అందరితో అనడం ఆర్చేవా రున్నారా? తీర్చేవా రున్నారా? |
|
దొంగనిశ అమావాస్య అర్ధరాత్రి గాఢనిద్ర పెరట్లోను చప్పుడవుతె ఇరుగు పొరుగు 'లెండో' యని కేకవేయ పాముచెవుల లోకం వినబడలేదని వాదిస్తుంది! కనబడలేదని గద్దిస్తుంది! |
|
ఏకాకి లోకానికి చెంద ఆకలికే ఓపలేక ఊరంతా పగలంతా తిరగడం రాతిరికి శూన్యంగా చెరువుగట్టు రావిచెట్టు చేరుకునే ఋషిపక్షి భిక్షుకుడు! |
|
కాటిసుంకం లేకపోతే నీటిలోన పడిపోతే తెప్పున తేలిపోతే ఉదయాన్నే చూచేందుకు వచ్చిన లోకం 'కుఁయ్యో' మని ఏడుస్తుందా? గలగల కన్నీరే కారుస్తుందా? |
|
ఎవరికి తెలుసు? ఎన్ని రెక్క లెగిరాయో! ఎన్నిచుక్క లారాయో! కన్నవార లున్నారా? విన్నవార లున్నారా? |
|
అనుకోకుండా హఠాత్తుగా అమాంతంగా నా హృదయం పురాణ బౌద్ధస్తూపం మహాధ్యానం చేస్తూ కూలిపోతే!! |