| కవితలు | రుధిరజ్యోతి శ్రీరంగం నారాయణబాబు |
కావాలి |
| కావాలి (జ్వాల - 1935) |
|
రేయి ముసుగు పుడమి కొసగి దివసావసాన కాష్ఠ జ్వాలల్లో కాలం సహగమనం చేసింది. |
|
ఆరిన చితిలో బూడిద వెన్నెల జారిన ముక్కుపుడక- ఒకటే చుక్క; సమాధిలో మృతశిశు వట్టుల జలదాంతర శశి! శ్యామల శ్మశాన వాటుల వ్రాలిన రాబందులె శరన్మేఘములు; |
|
వ్యోమ మార్గముల ఊహ కతీతంబగు శక్తి దృగంచలాలకు దొరకని వ్యక్తి సంచరించినది! సంచలించినది! సందేశాలను పెంపొందించే మూగ కేకలే వేసింది; |
|
నటరాజ పాదముల గజ్జల మ్రోతకు పాటలు కూర్చే కవులుంటే కావాలంటూ! |
|
చిలువతాలుపు గరళ కంఠమున కాలసర్పము జోల పాటలో సొక్కిపోవగ నాగస్వర మూదే కవులుంటే కావాలంటూ!! |
|
విలయవేళల ప్రళయ తాండవం చేసే శివునకు వెనుక పాటపాడే కవులుంటే కావాలంటూ!!! |