| కవితలు | రుధిరజ్యోతి శ్రీరంగం నారాయణబాబు |
కపాలమోక్షం |
| కపాలమోక్షం (ప్రతిభ - 1938) |
|
నిర్వికల్ప సమాధి నిమీలితాక్షుడు వేదసన్నిహితు డాది శంకరు తపస్సమాధిని ఓంకారమ్మే హుంకరించినది |
|
చలించినవి చరాచరమ్ములు భూతా లుద్రేకించినాయి కాటుక పెట్టిన నయనేంద్రియమై కర్మసాక్షియే చీకటు లురిలాడు. |
|
అభ్రగంగలో శుభ్రవీచికల హాలాహలమే తలఎత్తింది శేషుని ఫణాల మణుల కాంతులు వీసరవోయినవి |
|
పూదోటలు లేనేలేవు వసంతములు రానేరావు ముల్లోకమ్ముల తబిసి మిన్నలు ముర్మురించినారు |
|
అనంతకోటి జీవరాశులు హాహాకారం చేశాయి "హరోం! హరా!" యని "పాహి! పాహి!" యని ప్రణమిల్లాయి! |
|
ఆర్ద్రమైనది ఆ మహామహుని అంతఃకరణ అంతట అక్షులు విప్పి 'ఆకలి! ఆకలి!' అంటూ భిక్షాపాత్రకు చేయిచాపినాడు ఉగ్రతపస్సున మ్రగ్గినది వేడికంటికి సూడిద వెట్టిన బ్రహ్మకపాలం పట పట పళ్ళుకొరికినాడు నటరాజు! |
|
భూతపిశాచాల్ బొబ్బిరిల్లినవి వందిమాగధులు వణికారు భయపడి బసవడు రంకెవేసినాడు. |
|
భూలోకమ్మున తురకల గోరీలందున క్రైస్తవుల సమాధులందున హిందూ శ్మశానవాటుల కపాలమ్ములు విక విక నవ్వినవి పునుకలు పులకరించినవి కంకాళమ్ములు ఘల్లున మ్రోగినవి! |
|
శ్వేతపర్వతపు శిఖరాంచలముల కనకభాండమే కదిలింది. స్వాహావల్లభు సువర్ణగర్భం సళుపరించినది కళవళించినది. గంగవక్షమే పాలపోటుతో కళవళపడ్డాది సింధుగర్భమున గంగకడుపులో లవణసాగరపు లోతుల్లో దాగిన నేత్రాగ్ని మానవరూపం దాల్చింది. మన్నే వెలిగించింది మిన్నే పొగచూరింది! మంటల్లోనే పుట్టాడు! మంటల్లోనే పెరిగాడు!! మంటల్లోనే మడిశాడు!!! |
|
అగ్నివీణయై భుగ్నకంఠమై భగ్నగీతియై తారక మంత్రం పరంజ్యోతిగా వీరశైవుడు! |
|
భారత వీరుని కపాల మొక్కటి కపర్ది చేతిని రివ్వున వాలింది! కెవ్వున కేకేశాడు కంఠేకాలుడు! ఫాల నేత్రమే స్పందించింది అండ పిండ బ్రహ్మాండమంతా తాండవనృత్యం చేసింది ఆనందాశ్రుల నించింది. |
|
శేషుని ఫణాల మెత్తని శయ్య పుడమి ఒత్తిగిలింది. ఎడారి పుష్పించింది! |
|
ఎందరు పుట్టలేదు ఇంకెందరు గిట్టలేదు అందరికీ లభియిస్తుందా హాలాహల మంటిన హస్తస్పర్శ! పెదవుల చుంబనం! |
|
కపాలమోక్షం! కపాలమోక్షం!! |