| కవితలు | రుధిరజ్యోతి శ్రీరంగం నారాయణబాబు |
దేశమాత |
| దేశమాత (ప్రతిభ - అక్టోబరు 1937) |
|
ఎండాకాలం! ఎండాకాలం! పగళ్ళు నెగళ్ళు మండే రోడ్డు పన్నెండుగంటలు! |
|
కాలం కాలిన గుడ్డపీలికై ధూళిరేగినది విలయ వేళల విహాయసాలు విస్ఫులింగములు వర్షించాయి! |
|
గుప్పెడు అన్నం గ్రుక్కెడు నీళ్ళ స్వాతివానకే ముత్యపుచిప్పై కరువే రూపం దాల్చి కడుపే చెరువై ఏడ్చి నెలత ఒకర్తుక నిలబడ్డాది భిక్షాపాత్రికతో! |
|
రెండు కన్నులు కాలిన బండికమ్ములు పట్టలేని కూర్మిని పచ్చని సంపెంగల డాసి విగత ప్రాణులు వాలిన తుమ్మెద బారులు కాలిన మారుని తూపులు కలికి చూపులు |
|
అంటీ అంటని ఆమె శరీరపు చాలీ చాలని చీరను తొంగి చూచే మానం 'ఉన్నాడా చిన్ని కృష్ణుడు? అనసూయేదీ? అరుంధతే ద'ని ప్రశ్నించింది! |
|
చచ్చిన బాలింతల వెచ్చని చనుబాల తీపి మచ్చరించు కంఠముతో 'ఆకలి! దాహం! అన్నం! అన్నం!' అంటూ అటమటించింది అగ్నివీణయై ఆలాపించింది ఖణేలు మన్నవి కకుప్పాళికలు! |
|
బలి ప్రముఖుల పాతర మా భూమి అతిథి పూజలకు మొదటి వారలము! కర్ణుడు మావాడంటూ గంతులు వేసే దేశనాయకులు అన్నపూర్ణను ఆరాధించే ముగుదలు జాలకములపై తడిపిన వట్టివేళ్ళ తట్టీలు కట్టిన ఇండ్ల ద్వార ముఖమ్ములు బంధించారు కన్నులు మూసి నిద్రించారు!. |
|
దేశం అంటూ దేవుళ్ళంటూ కొలిచే కళ్లకు బానిసత్వమే ప్రబలింది. ఉసురుసురైంది ఉమ్మలించింది అసువులు వీడి చచ్చిన దేశమాతయై చాపచుట్టగ నేలకు వాలింది! |
|
వీధి కాలువను బురద నీటిలో విశ్రమించిన శ్వనాధు డొక్కడు నిశ్వసించినాడు. |
|
ముందరి కాళ్ళకు బంధంతో కాకితమ్ములే కసువని మేస్తూ చంక్రమణం చేసే చక్రీవంతపు చక్షులు చిలుపచిలుపగా తొలకరించినవి. |
|
తోడులేని నీడలేని ఆడుదాని చూడజాలక తరుశాఖల్లో తలక్రిందై తపించిపోయి ఋషి పక్షొక్కటి నేలకు రాలింది. |
|
భూపతి ఆజ్ఞను భూమి పుట్టువు చిచ్చున జొరబడ్డాది శీలంకోసం ఆనాడు! |
|
ఆకలి దీర్చని మానం గప్పని దేశం కోసం మట్టి ప్రమిదలో వత్తై కాలిందీ మానిని ఈనాడు!! |