| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
002. ఏరువాకమ్మ
| వానలు కురిసి పొలము పదునెక్కగనె దుక్కిటెద్దులను పూన్చి రైతు ఏరువాకను సాగిస్తాడు. ఏరువాక! ఎంత ముద్దైన మాట! మన జీవనములకు జీవము ఏరువాక. ఎడ్లకు పసుపుకుంకుమలు పూసి, ఏరును పూలమాలలతో నలంకరించి, ఏరువాకకు మంచిముహూర్తమున పూజలు చేస్తారు. సుహృదయులు కర్షకులు |
|
ఏరువాకమ్మకి ఏమి కావాలి? ఎర్ర ఎర్రని పూలమాల కావాలి ఎరుపు తెలుపుల మబ్బుటెండ కావాలి ఏరువాకమ్మకీ ఏమి కావాలి? పొలము గట్టున నిలిచి వేడుకోవాలి టెంకాయ వడపప్పు తెచ్చిపెట్టాలి ముత్తైదులందరూ పాట పాడాలి పాటపాడుతు తల్లి పాదాలు మొక్కాలి ఏరువాకమ్మనూ ఏమి కోరాలి? ఎడతెగని సిరులివ్వ వేడుకోవాలి పాడిపంటలు కోరి పరవశించాలి |
| ఎర్ర ఎర్రని పూలమాలలు ఊగుతుండగా, పసుపుటెరుపులు ఎడ్ల శరీరముల మీద అందపుటలలు తీర్చుచుండగా, ఎరుపు తెలుపుల మబ్బుటెండలో ముత్తైదుల పాటల ఉత్సాహములో జరయు మృతియు లేని ఏరువాకకు మరియొక పుట్టిన దినము జరుగుతుంది. |