| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
046. జారిణి కోపు
| ఇది వినండి తెలంగాణ కోలాటపు పాట. |
| గట్టూకు బొయి నేను - కట్టేలు తెమ్మంటె కొప్పునున్నా పూలు - ఎక్కడివె భామా? నీ కొప్పునున్నా పూలు - ఎక్కడివె భామా? ఆత్తేరి పూలు - ఎక్కడివె భామా ధూత్తేరి పూలు - ఎక్కడివె భామా గాలి ధూళీ వచ్చి - గంపంత మబ్బొచ్చి కొమ్మ ఊగి కొప్పు - నిండింది మగడా కొమ్మ ఊగి కొప్పు - నిండింది మగడా నాతోడు రంకాడలేదు - అబ్బతోడు రంకాడలేదు నీతోడు రంకాడలేదు - అమ్మతోడు రంకాడలేదు అన్నీ సరే కాని - ఇన్నీ సరే కాని కొంగు నిండా దుమ్ము - ఎక్కడిదె భామా? నీ కొంగు నిండా దుమ్ము - ఎక్కడిదె భామా ఆత్తేరి దుమ్ము - ఎక్కడిదె భామా ధూత్తేరి దుమ్ము - ఎక్కడిదె భామా పాటేలు ఇంటికీ - పాలకని పోతేను కఱ్ఱి కోడె కాలు - దువ్వింది మగడా కఱ్ఱి కోడె కాలు - దువ్వింది మగడా నాతోడు రంకాడలేదు - అబ్బతోడు రంకాడలేదు నీతోడు రంకాడలేదు - అమ్మతోడు రంకాడలేదు అన్నీ సరే కాని - ఇన్నీ సరే కాని చెంప నున్న కాట్లు - ఎక్కడివె భామా? నీ చెంప నున్న కాట్లు - ఎక్కడివె భామా ఆత్తేరి కాట్లు - ఎక్కడివె భామా ధూత్తేరి కాట్లు - ఎక్కడివె భామా కోమటోరింటికి - కొబ్బరికి బోతేను తక్కెట్లొ గుండొచ్చి - తగిలింది మగడా తక్కెట్లొ గుండొచ్చి - తగిలింది మగడా నాతోడు రంకాడలేదు - నీతోడు రంకాడలేదు అమ్మతోడు రంకాడలేదు - అబ్బతోడు రంకాడలేదు అన్నీ సరే కాని - ఇన్నీ సరే కాని మంచం క్రింది వాడు - ఎవ్వాడె భామా? నీ మంచం క్రింది వాడు - ఎవ్వాడె భామా? ఆత్తేరి వాడెవ్వాడె భామా ధూత్తేరి వాడెవ్వాడె భామా ప్రక్క ఇంట్లుండేటి - పడుసు పిల్లోడు పిల్లీకి తలనొస్తె - నల్లి కొచ్చిండు పిల్లీకి తలనొస్తె - నల్లి కొచ్చిండు నాతోడు రంకాడలేదు - నీతోడు రంకాడలేదు అమ్మతోడు రంకాడలేదు - అబ్బతోడు రంకాడలేదు |
| 'కోపులు ముడిభావాలు కాదు, రచన'లనటానికి ఇది చక్కని ఉదాహరణము. కొమ్మ దూగి కొప్పునిండుట వల్ల వచ్చే లేనిపోని రవ్వలు అన్ని పాటలలోనూ కనబడతవి. "ఏమే పిల్లా మదారి బూబూ కుంకుం సెదిరిందే, లమిడీ కుంకుం సెదిరిందే" అని అడిగితే, " ఉడుకుడుకన్నం ఊపుకుతింటే, కుంకుం సెదిరిందే మామా" అన్న జవాబు గల పాట కూడా ఈ కోవ లోనిదే. నల్లిని చంపిన వాసన తలనొప్పికి మందని తెలంగాణమున వెల్లడే. తక్కినవారికేమొ? తెలీదు. |