| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
055. ఏలకోపు - 1
| ఇవి రెండూ చిత్రమైన పాటలు. వీటి త్రిశ్రగతీ, పాదసంపూర్ణతా, వస్తు సంకీర్ణతా, రచనా ప్రాగల్భ్యమూ వీటిని కోలాటపు పాటలలో చేర్చటానికి సాయపడ్డవి. వీటిలోని శృంగారమును బట్టి వీటిని ఏలకోపులంటున్నాము. |
|
వానేల గురిసెనో రాజో! నా స్వామి, వరదరాజుల పువలవాన ॥ఔను॥ మళ్ళి గురిసిన పువలవానో! నా స్వామి, మగువ దగ్గిరపేటలోను ॥వా॥ చీరెల్ల చిత్తారు నేతో! నా స్వామి, ఒళ్ళెల్ల జవ్వారి పూత ॥ఔను॥ యెల్లయెడ్లను దున్నువాఁడ, చినవాఁడ! యెల్లుండి నే వెళ్ళిపోతా ॥వా॥ వెళ్లిపోయే చిన్నవాఁడ! నా స్వామి, వ్రేళ్ళనిండా ఉంగరాలు ॥ఔను॥ ఉంగరాలు చెయ్యి చూస్తే, నారాజ! ఉండదయ్య ముండమనసు ॥వా॥ ముంగటేరు దున్నువాఁడా! నా స్వామి, ముత్యాల పోగులవాఁడ ॥ఔను॥ సాలుదప్పక దున్నుతావా! చినవాఁడ! దారితప్పక నేనెవస్తా ॥వా॥ కావిడేసుక నువ్వు రారో! చినవాఁడ! కడవ బట్టుక నేనెవస్తా ॥ఔను॥ నీటిమీద కొంగు పఱచి! నారాజ! నిద్దురే నీకిచ్చి పోతా ॥వా॥ కొండమీఁద కొఱ్ఱచేనో! చినవాఁడ! కొఱ్ఱబోతే రెడ్డిసాని ॥ఔను॥ రెడ్డిసాని ఱొమ్ముమీద! నా రాజ! గోగుపువ్వే గొడుగునీడ ॥వా॥ |