| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
064. అవిరేడు మంగళ హారతి
| ఈ రెండవది అవిరేణి పాటయే. తలంబ్రాలు పోయించిన తరువాత శిరస్స్నానాలు వధూవరులకు చేయించి, పెళ్ళి పీటలమీద ఆశీర్వచనాలు చేసి, అరుంధతికి మ్రొక్కించి పేరంటాండ్రతో అవిరేడు వద్దకు తీసుకుపోయి వధూవరులచేత అవిరేడునకు మ్రొక్కించి ఈ మంగళహారతిని పాడుదురట. |
|
జయ మంగళం। నిత్య శుభ మంగళం! జయ జయా! మంగళం। మహోత్స మంగళం | ॥జ॥ |
|
దివ్యాంబరములు గట్టి। దీపాల వెలుగున నవ్వుచూ మహలక్ష్మి। నాట్యమాడా యిలవేల్పు నీవు। వెలసితివి మాయింట | ॥జ॥ |
|
సిరిగజ్జెలను గట్టి। చిందులు ద్రొక్కుచు సిరిలక్ష్మి మాయింట। స్థిరముగానూ యేకచిత్తంబున। యెప్పుడు కలకల బాయక, భక్తిలో। నుందువమ్మా | ॥జ॥ |
|
మల్లెతోటలోను। మసలుతూ! మహలక్ష్మి యెల్లలోకంబులు। యేలుతూనూ యుల్లాసంబుతోను। యూరు పాలించుచూ యెప్పుడు నుప్పొంగు। తుందువమ్మా | ॥జ॥ |
|
కనక గద్దెమీఁద। కదలక కూర్చుండి అడిగినప్పుడు మాకు। అభయమిచ్చి కోరిన కోరికలు। కొనసాగింతువని బలువయిన, పట్టు మేం। పడితిమమ్మా | ॥జ॥ |
|
కొప్పు చక్కగ బెట్టి। గొజ్జంగులను ముడిచి పమిడి, జల్తారు। పట్తుచీర గట్టి రంగైన రత్నాల। రవికెను తొడిగిన భక్త పోషిణి మమ్ము। పాలించవమ్మా | ॥జ॥ |
|
ఆభరణములు తెచ్చి। అలంకరించి నీకు పసిడి గొలుసులు తీర్చి। బాగుగ వేసి గంటలొడ్డాణంబు। కన్నతల్లికి పెడుదు కన్నబిడ్డలనుచు। కరుణించు తల్లీ | ॥జ॥ |
|
అందముతో నీపను। లమరించినట్లు తప్పులను బట్టక। దయను జూడు యెప్పుడు నీపాద। యేకసేవ జేతు యొప్పతో నీ యొద్ద। నుంచవమ్మా | ॥జ॥ |
| ఆడపడుచు అత్తవారింటికి కదిలే ఘట్టము గృహజీవనము లోని సుందర దృశ్యాలలో ఒకటి. ఈ పాటలో అత్తింటికి పోయే పడుచు పలుకుతున్నది. |