| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
080. పుట్టినింటికి
| అభిజాత్యము ముదిరిన సిరిమంతులకు విడ్డూరమైనది విడాకులు. పాటకపు జనములో ఇవి పరిపాటియే. మగని బాధ పడలేక పుట్టినింటికి నడక సాగించినది అభిమానపు పడుచు! "కాశి కెళదామంటె కదలవే కాళ్ళు, ఢిల్లి కెళదామంటె తిరగదే మనసు. నా రాచ పుట్టింటి కెళదాము అంటె, నా కాళ్ళు పన్నిన్న రథములై నడుచు, నా చేతులుయ్యాల చేరులై యూగు". అయితే దారి తోడు నుంచి ప్రశ్న వచ్చింది. |
|
ఏ వూరు ఏపల్లి తుమ్మెదా ఎక్కడికి ఎల్తావు తుమ్మెదా గులకల్లపాడూ గుమ్మడే గోదారి పక్కని గుమ్మడే గులకల్లపాడూ తుమ్మెదా అత్తోరు ఊరూ తుమ్మెదా పుట్టిల్లు లేక తుమ్మెదా పుట్టిల్లు మాదా గుమ్మడే గులకల్ల పాడే గుమ్మడే పాడిపంట ఉందా తుమ్మెదా సంతానము ఎందరె తుమ్మెదా పాడిపంట లేదు గుమ్మడే సంతానము లేదు గుమ్మడే అత్తగారు ఉందా తుమ్మెదా ఆడబిడ్డలు ఉన్నారా తుమ్మెదా అత్తగారు పోరు గుమ్మడే ఆడబిడ్డలు పోరు గుమ్మడే పడలేక నేను గుమ్మడే మావూరు పోతున్నా గుమ్మడే పెద్దవోరు లేర తుమ్మెదా కంత బుద్ధి సెప్పడానికీ తుమ్మెదా బుద్ధి సెప్పేవోళ్ళకి గుమ్మడే అసలు బుర్రే లేదు గుమ్మడే అత్తలేని యిల్లు తుమ్మెదా ఆరళ్ళు ఉండదు తుమ్మెదా ఆయిగా ఉంటాను తుమ్మెదా |
| బుద్ధి చెప్పేవారు అక్కడా ఉన్నారు. అసలు సంగతి వారికెట్లెరుక పడును? తెలియక పోయినా చెప్పుట కందరూ పెద్దలే. వారికే బుద్ధి లేదట. ఇలాటి పడుచులే "ఆడదానినయి పుట్టుట కంటే అడవిలో మానయి పుట్టుట మేలు" అని నిట్టూర్పులు నిగిడ్చేది! |