| దేశి సాహిత్యము | జానపద గేయములు | పల్లెపదాలు : కృష్ణశ్రీ |
158. నెరబండి
| బండి. మానవకోటికి పూర్వజన్మము సెలయేటి బిందువులు కాబోలు. అందుకే ప్రయాణమన్న అందరికీ అంత యిష్టము. బండి, నాటి నుండి నేటి వరకూ నిలిచిన అందపు వాహనము. ఎన్ని జంటలనో వలెనే బండి ఈ జంటనుకూడ మోసుకొని సాగుచున్నది. |
|
నెరా నెరా నెరబండి నీలమోరి బండి | నెరా |
|
అద్దరేతిరి కాడ నిద్దరోతుంటేను బండెక్కు బండెక్కు మన్నాడె బావ | నెరా |
|
జల్తారి సీరకట్టి జడకుచ్చులెనకట్టి నిలుసుంటె నాకేసి ఎగాదిగా సూసేడు | నెరా |
|
పుల్లెద్దు బండి కట్టి తెల్లెద్దు బండి కట్టి పుల్లెద్దు తెల్లెద్దు ఏకమైనాయి | నెరా |
|
ఎద్దులకి మువ్వలు కట్టి నాతల్లొ పువ్వులు పెట్టి మువ్వల సప్పుడు పువ్వుల వాసన ఒకటైపోయినాయి | నెరా |
|
మూటకట్టమన్నాడు ముల్లె కట్టమన్నాడు మూట ముల్లె కట్టి ఎనకెక్కమన్నాడు | నెరా |
|
పాటలు పాడుకుంటా మాటాలాడుకుంటా కమిసి కర్రొట్టుకొని ఎనకాలెక్కాడు | నెరా |
|
గట్టంటె గట్టు కాదు పుట్టంటె పుట్టకాదు గతుకుల్లొ మాబావ సతికిల్ల బడ్డాడె | నెరా |
|
పక్క పల్లంలోను చెక్కబెల్లం వుంటేను బండి నిలిపి బెల్లాము భోంచేసినాడొ | నెరా |
|
వర్సాము కురిసింది వానయినా కురిసింది వర్సాము వానాలో తడిసీపోయేము | నెరా |
|
సిట్టడవి దాటేము పొట్టడవి దాటేము అన్నడవిలు దాటేసి ఐక్యామై పోయేము | నెరా |
| వారు పొందని అనుభవాలు లేవు. గతుకులలో పడి వర్షములో తడిసి అడవులన్నీ దాటి "అనంత పథాలకు ప్రయాణమైనారు". |
| ఎక్కు నరసూ బండెక్కు నరసూ ఎక్కిన బండి దిగొద్దు నరసూ ॥ |
| అన్నపాట దీని తరువాతిది. |